వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న.. పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదిక, జనరల్ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. సీఎం జగన్ పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు.. మెమో దాఖలుపై వివేకానందరెడ్డి కూతురు తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ ఉపసంహరణపై సీఎం జగన్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. టీడీపీ ప్రభుత్వం కేసు నీరుగార్చే అవకాశం ఉందని.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ కోరిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా హైకోర్టుకు గుర్తు చేశారు.
కర్నూలులోని ఓ కేసును సీబీఐకి ఇస్తామని ప్రకటన చేశారని.. మరి వివేకా కేసులో అభ్యంతరమేంటని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు తీర్పు రిజర్వు చేసింది.