Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ వివేకా హత్య కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత

Advertiesment
ys sunitha
, శనివారం, 13 ఆగస్టు 2022 (08:29 IST)
తన తండ్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. 
 
తన తండ్రి హ్య కేసు దర్యాప్తును సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్‌లో వివరించారు. 
 
కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై నిందితులుగా ఉన్న వారు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసు దర్యాప్తు జాప్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదుచేశారు. ఈ కేసు దర్యాప్తును అవసరమైతే వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె కోరుతూ... ప్రతివాదులుగా సీబీఐ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఏపీ డీజీపీలను చేర్చారు. 
 
2019 మార్చి 15న వివేకానంద రెడ్డి పులివెందులలోని సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. మూడేళ్లు దాటిపోయినా... అసలు హంతకులు ఎవరనేది ఇంత వరకు వెల్లడికాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీత.. సుప్రీంకోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశమైంది. 
 
వివేకా హత్య జరిగిన వెంటనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హత్యకేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను నియమించింది. ఏడాది వ్యవధిలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటైనా హంతకులను పట్టుకోలేకపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ సునీత రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. 
 
సునీత పిటిషన్‌ను విచారించిన హైకోర్టు 2020 మార్చి 11న సీబీఐకి కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జులై 18న కడపలో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 246 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులపై ఛార్జిషీట్‌ దాఖలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. 
 
ఏ1గా ఎర్రగంగిరెడ్డి, ఏ2గా సునీల్‌యాదవ్‌, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ4గా దస్తగిరి, ఏ5గా దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్లను ఛార్జిషీట్‌లో సీబీఐ నమోదు చేసింది. వీరిలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం కడప జైల్లో రిమాండు ఖైదులుగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి బెయిల్‌పై ఉన్నారు. అయిదు నెలలుగా సీబీఐ విచారణలో వేగం మందగించింది. ఎవరినీ విచారణ చేయడం లేదు. ఈ క్రమంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రత్యేకతను సంతరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోక్షం కోసం నిప్పంటించుకున్న యువకుడు