మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకడైన దస్తగిరి... ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. గతంలో తనకు రూ.5 కోట్లు ఇస్తామని ఆశచూపి ముంచేశారని ఆయన భార్య షబానా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఈ హత్య కేసులో సీఎం జగన్, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిలు తన భర్తను బలిపశువును చేశారని మండిపడ్డారు. పైగా, చేయని తప్పుకు తన భర్తను జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలోని పులివెందులలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, వివేకా హత్యలో మీ ప్రమేయం లేనప్పుడు నిర్దోషులుగా నిరూపించుకోవాలే తప్ప, తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. తాము అల్పులమని, తమతో ఎందుకు యుద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.కోట్లు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని, గతంలో నా భర్త దస్తగిరికి రూ.5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు చేయని తప్పునకు జైలుకు పంపి బయటకు రాకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. సొంతవారినే హత్య చేసిన వారు మమ్మల్ని వదిలిపెడతారని అనుకోవడం లేదన్నారు. మాకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తు చేశారు.
పోలీసులు, వైకాపా కార్యకర్తలు నా భర్తకు శత్రువులుగా మారారని, ఆయనకు ప్రాణహాని ఉందని కాపాడాలంటూ పలువురిని ప్రాధేయపడి బెయిల్ తెచ్చుకున్నా బయటకు రానివ్వడం లేదని వాపోయారు. పీటీ వారెంట్ వేశారని, దానిపై కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే నా భర్తను జైలు నుంచి బయటకు రానివ్వాలి, అలా రాకుండా చేస్తున్నారంటే మీరు తప్పు చేశారని ఒప్పుకొన్నట్లే కదా? అని ప్రశ్నించారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే జైలులో ఉన్న దేవిరెడ్డి శివశంకర రెడ్డి కుమారులు ఇటీవల నా భర్తను కారాగారంలో కలిసి ప్రలోభపెట్టారని ఆరోపించారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, అధికారి దీపక్‌గౌడ్, డీజీపీ సుహాసిని బలవంతంగా అప్రూవర్‌గా మార్చారని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. వివేకా కుమార్తె సునీత తమకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.