తునిలో జరిగిన బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు జగన్ దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదాను పక్కనబెట్టారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరారు.
ఏపీలో మూడు రాజధానుల పేరిట మభ్యపెట్టి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని, చంద్రబాబు, జగన్ పాలనలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైన రాలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ పులా? సింహమా? ఏది.. అయితే బీజేపీపై ఒక్కసారి గర్జించమని అడగండి.. అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు, ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాగడం తప్పా మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులను జగనన్న మోసం చేశారని షర్మిల అన్నారు.