ఏపీలోని వరద బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న గృహాల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న సాయం పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాల్లో సాగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులోభాగంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపణీతో పాటు బాధిత కుటుంబాలకు రూ.2 వేలు అదనంగా చెల్లించాలని కోరారు.
అలాగే, వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో తాగునీటితో పాటు.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వరదల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.