టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ గడ్డపై సీఎం జగన్ తొలిసారి అడుగుపెట్టారు. వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమం కుప్పం వేదికగా జరుగుతుంది. అలాగే, ఈ నియోజకవర్గంలో రూ.66 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపనలు చేస్తారు.
అంతకుముందు ఆయన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇతర వైకాపా నేతలు స్వాగతం పలికాలు.
పైగా, ముఖ్యమంత్రి హోదాలో జగన్ కుప్పంకు విచ్చేయడం ఇదే తొలిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన రూ. 66 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.