నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. జూన్ 8వ తేదీన ఆయన 20 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరుకాకుండా మరో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించనున్నారు.
అయితే, జగన్ మంత్రివర్గంలో ఎవరవరికి చోటుదక్కుతుందన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు సూచనప్రాయంగా అందించిన సమాచారం మేరకు.. జగన్ మంత్రివర్గంలో 25 మందికి చోటు ఖాయమని తెలిపారు.
వీరిలో బొత్స సత్యనారాయణ, సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం అందించినట్టు సమాచారం. మిగిలిన వారికి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలలోపు సమాచారం అందనుంది.