Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖిలప్రియకు మొదట ఫోన్ చేసింది మేమే. ఇప్పుడీ రాజకీయం ఏమిటి: జగన్ విచారం

"నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి మొట్టమొదట ఫోన్‌ చేసింది నేనూ, మా అమ్మే. మృతి వార్త తెలియగానే చాలా బాధేసింది. ఇద్దరమూ అఖిలప్రియతో మాట్లాడి ధైర్యం చెప్పాం. అదీ వ్యక్తిగతంగా మేం ప్రదర్శించిన మానవత్వం. కానీ

Advertiesment
Bhuma nagireddy
హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (04:09 IST)
"నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి మొట్టమొదట ఫోన్‌ చేసింది నేనూ, మా అమ్మే. మృతి వార్త తెలియగానే చాలా బాధేసింది. ఇద్దరమూ అఖిలప్రియతో మాట్లాడి ధైర్యం చెప్పాం. అదీ వ్యక్తిగతంగా మేం ప్రదర్శించిన మానవత్వం. కానీ, ఇక్కడ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి" అంటూ వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత వైఎస్‌ జగన్‌ లాబీల్లోని తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. మనుషుల్లో ఉండాల్సింది తొలుత మానవత్వమని చెప్పారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో జరిగింది చూస్తే సంతాప తీర్మానం వెనక్కిపోయి రాజకీయమే ముందుకొచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. తాము సభలోకి వెళ్లి సంతాప తీర్మానంపై మాట్లాడి ఉంటే భూమా నాగిరెడ్డి మంచితోపాటుగా చివరలో ఆయన చేసిన తప్పును కూడా చెప్పాల్సి వచ్చేదన్నారు. భూమా చేసిన తప్పును చెప్పడం ఇష్టంలేకనే  హుందాతనం పాటించామని పేర్కొన్నారు.
 
తండ్రి మరణించి 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొ చ్చారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండి ఏడ్వడానికీ అవకాశం ఇవ్వలేదు. వీళ్ల(టీడీపీ పెద్దలు) రాజకీయాలను చూసి అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మేము సారథ్యం వహిస్తున్న పార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యం. మనకు ఒకరిపై ఉన్న వ్యక్తిగత అభిమానం పార్టీ శ్రేణుల నైతికతను దెబ్బతీసే విధంగా ఉండరాదు. భూమా మృతి చెందిన విషయం తెలియగానే మేము ఆయన కుమార్తెకు ఫోన్‌ చేసి, పరామర్శించాం. ఇదీ తక్షణమే మేము స్పందించిన తీరు. అంతకు మించి ఏం చేసినా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి.
 
తండ్రి చనిపోయి 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నపుడు అలాంటి సభలో మేం ఏం మాట్లాడినా భూమా ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా మొత్తం రాజకీయంగా వివాదాస్పదం అవుతుంది. అసెంబ్లీలో సంతాపతీర్మానంపై ముందు విష్ణుకుమార్‌రాజుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడిన మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో అర్ధం అయ్యే ఉంటుంది. మేం కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే చంద్రబాబు తప్పు చేయిస్తే భూమా నాగిరెడ్డి ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేదో అర్ధం చేసుకోండి.
 
24 గంటలైనా గడవక ముందే భూమా కుమార్తెను అసెంబ్లీకి తేవడం వారి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా కుసంస్కారం, దిగజారుడు రాజకీయాలు వారివే. గతంలో శాసనసభలో శోభానాగిరెడ్డికి సంతాపం చెప్పడానికి కూడా టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. మా ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శించిన తరువాత గానీ ఆమె పేరును తీర్మానంలో చేర్చలేదు. ఇవన్నీ జరిగిన యథార్థాలే... అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే అన్నీ తెలుస్తాయి. కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగిన వీళ్లు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచీ అంతా కుసంస్కార రాజకీయాలే చేశారు. అయినా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు హుందాతనాన్ని ప్రదర్శించారు, ఎవరు ప్రదర్శించలేదు ఇవన్నీ చూసే వారికి అర్థం అవుతుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అని జగన్ ముగించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా అమ్మను శశికళే కొట్టి చంపేసింది. ఆమె ఆస్తులన్నీ నావే అంటున్న జయలలిత కొత్త కొడుకు