విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ప్రతి పోలీసు అమరవీరుడికి జేజేలు పలికారు. పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించవద్దని సీఎం జగన్ సూచించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి.. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామన్నారు. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు. పోలీసు శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని పేర్కొన్నారు.
కుల, మత ఘర్షణల్లో ఎలాంటి ఉపేక్ష లేకుండా పోలీసులు పనిచేయాలన్నారు. దిశ పీఎస్‌లు, ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయన్నారు. దిశ బిల్లును త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.