ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో ఆయన వద్ద మరింత సమాచారం రాబట్టేందుకు వీలుగా సిట్ అధికారులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనను విచారణ కోసం విజయవాడ కోర్టుకు తరలించారు. ఆయన వద్ద రెండు రోజుల పాటు విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో శుక్రవారం ఉదయం సిట్ అధికారులు ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆయన్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 19, 20వ తేదీల్లో ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మిథున్ రెడ్డిని విచారించనున్నారు. మరోవైపు, ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెల్సిందే. ఈ కేసులో సుమారు రూ.3500 కోట్ల కుంభకోణం జరిగినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.