డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు కాకినాడ ఏఎస్పీ వెల్లడించారు.
పోలీసుల కస్టడీలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ సంచలన విషయాలు వెల్లడించారు. తానే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
ఈ హత్యలో తాను ఒక్కడినే పాల్గొన్నట్లు ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత విషయాలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేయడంతో సుబ్రహ్మణ్యాన్ని కొట్టి బెదిరిద్దాం అనుకున్నానని చెప్పారు.
కానీ హత్య చేయాలని భావించలేదని, తాను ఆవేశంలో కొట్టడంతో అతడు చనిపోయాడని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వెల్లడించారు.
మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకుని జిల్లాలో అన్నింట్లో వేలు పెట్టి తనకు వాటా కావాల్సిందేనని ముక్కుపిండి మరీ వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరిని కలవాలన్నా మొదట అతడిని కలిస్తేనే పని జరిగేది? అంతటి నెట్ వర్క్ పెట్టుకున్నట్లు సమాచారం.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమాలు అనేకం ఉన్నాయి. బినామీల పేరిట క్వారీలు, చేపల చెరువులు, గంజాయి, కలప అక్రమ రవాణా అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతోందని తెలుస్తోంది. ఆయన మాటే శాసనం.
ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది. ఇంత జరుగుతున్నా ఎక్కడ కూడా ఆయన పేరు బయటకు రాకపోవడం గమనార్హం. గతంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైనా 2019లో వైసీపీలో చేరి దాన్ని ఎత్తివేయించుకున్నట్లు సమాచారం.
2014 శాసనసభ ఎన్నికల్లో కొండకాపు(ఎస్టీ) నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో నామినేషన్ వేయగా ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు ఆధారాలు చూపడంతో నామినేషన్ రద్దయింది.
దీంతో నామినీగా ఉన్న రాజేశ్వరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి గెలిపించి తరువాత ఆమె ఏటీఎంను తన దగ్గరే పెట్టుకుని ఆమె గౌరవ వేతనాన్ని కూడా అతడే తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతటి దుర్మార్గమైన వ్యక్తిపై ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం విడ్డూరమే.
2019లో నాగులపల్లి ధనలక్ష్మిని ఎమ్మెల్యేగా గెలిపించి అదే విధంగా అక్రమాలు కొనసాగించారు. ఆమె పేరు చెప్పుకునే అందిన కాడికి దోచుకున్నారు. మన్యంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు ఆయనే చిరునామా. ఏ చిన్న వ్యవహారమైనా ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించడం సాధారణమే.
ఇంతటి అక్రమాల ఘోష ఎవరిని కదిలించలేదు. అందుకే ఇంత కాలం ఆయన అక్రమాలు వెలుగు చూడలేదని తెలుస్తోంది.