ఈ నెల 15, 16 తేదీల్లో కృష్ణాజిల్లా ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్
రెస్టింగ్ అసోసియేషన్ సహకారంతో, సిబిఅర్ స్పోర్ట్స్ అకాడమీ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెస్లింగ్ (మట్టికుస్తి), సీనియర్ అండ్ జూనియర్ ఛాంపియన్ షిప్ మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు
ఏపి ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అర్జా పాండురంగారావు తెలిపారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిబిర్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సిబిఅర్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె.పి.రావు, ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనాల సంతోష్‌కుమార్, కోశాధికారి జి.భూషణంతో కలిసి ఆయన మాట్లాడారు.
కేతనకొండలోని సిబిఅర్ స్పోర్ట్స్ అకాడమీ గ్రౌండ్స్‌లో పోటీలు జరుగుతాయన్నారు. సీనియర్ విభాగంలో 20 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, జూనియర్స్ విభాగంలో 18 నుండి 20 సంవత్సరాల వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు.
సీనియర్ మరియు జూనియర్స్ విభాగాలలో పురుషుల వెయిట్ క్యాటగిరి కేజీల్లో 52, 57, 61, 65, 74, 86, 97 ఓపెన్ ఛాలెంజ్ 90 నుండి 120, స్త్రీలు విభాగంలో 50, 55, 59, 62, 65, 68, 76 ఓపెన్ ఛాలెంజ్ 65 నుండి 80 అని పేర్కొన్నారు. పురుషులు విభాగంలో ఆంధ్రకేసరి టైటిల్ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ పోటీల్లో మొదటి స్థానం సాధించిన విజేతకు గదను బహుకరించడం జరుగుతుందన్నారు. పోటిల్లో పాల్గొనే అన్ని జిల్లా సంఘాలు వారి క్రీడాకారుల వయస్సు దృవీకరణ పత్రాలతో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు సిబిర్ స్పోర్ట్స్ అకాడెమీలో సంప్రదించాలని కోరారు.
14వ తేదీ సాయంత్రం నుండి 16వ తేదీ సాయంత్రం వరకు భోజన, నివాస వసతి సదుపాయాలను క్రీడాప్రాంగణంలో నిర్వహణ కమిటి వారిచే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు బరువులు తీయబడతాయని తెలిపారు. మరుసటి రోజు ఉదయం నుండి పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.