Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు సమన్వయంతో పని: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు సమన్వయంతో పని: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
, బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:56 IST)
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నివారించేందుకు అటవీ, పోలీస్ తదితర శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయడం ద్వారా స్మగ్లింగ్ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.

ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రెడ్ సాండల్ (ఎర్ర‌చందనం) ప్రొటెకక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్ర చందనం స్మగ్లింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఎర్ర చందనం సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అటవీశాఖలో గల ఖాళీలను తక్షణం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణకు అటవీశాఖకు ప్రత్యేకంగా ఇంటిలిజెన్స్ వింగ్ ను ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి తగిన ప్రతిపాదనలతో రావాలని పిసిసిఎఫ్ ను ఆమె ఆదేశించారు.

అదే విధంగా తిరుపతి కేంద్రంగా ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్సు టీంనకు ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారిని నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్న అంశంపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని సిఎస్ నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు సిబ్బందికి ప్రభుత్వ ఉత్వర్వుల సంఖ్య 74 ప్రకారం తగిన నష్ట పరిహారాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం ఉన్న ఇంటిలిజెన్స్ వ్యవస్థను మరింత అప్ గ్రేడ్ చేసి మెరుగైన రీతిలో ఆ వ్యవస్థ స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణకు తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ 2003 నుండి ఇప్పటి వరకూ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించి 15వేల 940 కేసులు నమోదు  చేసి 14వేల 546 టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

అలాగే 9వేల 694 వివిధ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 29వేల 235 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అంతేగాక స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనంలో 2005 నుండి 2018 వరకూ 8వేల 179 మెట్రిక్ టన్నులు అమ్మకం,6వేల 822 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేయడం ద్వారా ఇప్పటి వరకూ సుమారు 1700 కోట్ల రూ.లు ఆదాయం సమకూర్చడం జరిగిందని తెలిపారు.

అంతకు ముందు అటవీ శాఖ విజిలెన్సు వింగ్ అదనపు పిసిసిఎఫ్ ఎకె ఝా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వివరించారు.

అదేవిధంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో మొత్తం 913 బేస్ క్యాంపులు ఉండగా వాటిలో 86 ప్రత్యేకంగా ఎర్ర చందనం సాగయ్యే ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు.

52 స్ట్రంకింగ్ ఫోర్సులకు గాను 32 ఆప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయని,113 చెక్ పోస్టుల్లో 50 ఆ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నట్టు తెలిపారు. సిబ్బందికి 42 హైరిజల్యూషన్ కెమెరాలను అందించడం జరిగిందని, 2009-10 ఏడాదిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించి 42మందిని పిడి యాక్టు కింద అరెస్టు చేయడం జరిగిందని వివరించారు.

సమావేశంలో అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్ అయ్యన్నార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పిసిసిఎఫ్ బివి రమణమూర్తి, పోలీస్, అటవీ, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
ఆహార‌శుద్ధి యూనిట్ల‌కు క‌మిటీ ఆమోదం
రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగానికి సంబంధించి వివిధ పరిశ్రమలు ఏర్పాటుకై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన జరిగింది.

ఈ సంద‌ర్భంగా సమావేశంలో ప్రధానంగా గత నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన 21 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు.

వాటిలో ముఖ్యంగా 14 నూతన ఆహారశుద్ధి యూనిట్లు, 2 పుడ్ టెస్టింగ్ లాబరేటరీలు,4 పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల టెక్నాలజీ అప్ గ్రడేషన్, మోడరనైజేషన్, విస్తరణ,1 మెగా పుడ్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించి అవసరమైన వాటికి ఆమోదం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి, ఆహారశుద్ధి సంస్ధ సిఇఓ ఎల్.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పగడ్బందీగా పరీక్షల నిర్వహణ:మంత్రి సురేశ్