మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ, ఆ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. తాజాగా దిశ యాప్ సాయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆపదలో ఉన్న మహిళను పోలీసులు కాపాడారు.
పొరుమామిళ్లకు చెందిన సుభాషిణి అనే యువతి ఉపాధ్యాయ పరీక్ష రాసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో సదరు యువతితో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే దిశ యాప్ ఎస్‌వోఎస్ ద్వారా జిల్లా ఎస్పీకి ఫోను ద్వారా ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన వైఎస్సార్ జిల్లా పోలీసులు సకాలంలో ఢిల్లీ పోలీసులను సంప్రదించి, స్థానికం స్వచ్చంద సంస్థ సహకారంతో ఆ మహిళను పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఆటో డ్రైవర్ నుంచి కాపాడి కడపకు చేరే వరకు యువతికి పోలీసులు అండగా నిలబడ్డారు.
ఆపదలో ఉన్న సమయంలో తనను క్షేమంగా గమ్యానికి చేర్చిన జిల్లా పోలీసులకు బాధిత యువతి ధన్యవాదాలు తెలిపింది. జిల్లా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ, దిశ యాప్ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.