Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతులేని అమ్మ ప్రేమ... స్కూటీపై కొడుకును నెల్లూరు నుంచి బోధన్ కు తీసుకెళ్లిన మహిళ

అంతులేని అమ్మ ప్రేమ... స్కూటీపై కొడుకును నెల్లూరు నుంచి బోధన్ కు తీసుకెళ్లిన మహిళ
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:23 IST)
webdunia
అమ్మ ప్రేమకు అంతులేదు. తనయుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అధికారుల అనుమతి తీసుకుని, స్కూటీపై వెళ్లి తనయుడిని చేరుకుంది.

సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి తీసుకుని వచ్చింది. ఆ తల్లి సాహసానికి అందరూ సలామ్‌ చేస్తున్నారు.
 
బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పటినుంచి పిల్లల ఆలనాపాలనా ఆమే చూస్తోంది. 
 
చిన్నవాడైన మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. 
 
నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. అతడి ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షల కోసం గత నెల ఇద్దరు కలసి హైదరాబాద్‌ నుంచి బోధన్‌కు వచ్చారు. 
 
స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్‌ మార్చి 12 నెల్లూరుకు వెళ్లాడు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అతడు∙ చిక్కుకుపోయాడు. ఇది తెలిసి తల్లి రజియాబేగం ఆందోళనకు గురయ్యారు. 
 
బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన ఇచ్చిన లెటర్‌ తీసుకుని, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. 
 
కుమారుడితో కలిసి అదే స్కూటీపై సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం మధ్యాహ్నం వారు కామారెడ్డికి చేరుకున్నారు. 
 
కామారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కొడుకును చూడాలనే తపన తనను అంతదూరం వెళ్లేలా చేసిందని తెలిపారు. కుమారుడిని ఇంటికి క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా వెళ్లానని, అటవీ ప్రాంతం గుండా వెళ్లినా భయం అనిపించలేదన్నారు. 
 
చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్‌ ఏసీపీ ఇచ్చిన లెటర్‌ను చూపించడంతో అనుమతించారని వివరించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మున్ముందు పరిస్థితి మరింత దిగజారవొచ్చు... ఇమ్రాన్ ఖాన్