విశాఖపట్టణం జిల్లా పెందుర్తితో ఓ మహిళ పోలీస్ స్టేషన్ గేటుకు ఏకంగా తాళం వేసింది. అద్దె వివాదాన్ని పరిష్కరించడంలో విఫలం కావడంతో ఆ మహిళ ఈ సాహసానికి పూనుకుంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఎన్ఏడీ పైవంతెన సమీపంలోని బాజీ కూడలి ప్రాంతానికి చెందిన తెరపల్లి గౌతమి పార్వతి (42) భర్తతో వేరుపడి జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురంలో ఓ అపార్టుమెంట్‌లో ఆరేళ్లుగా కుమారుడు, కుమార్తెతో కలిసి అద్దెకు ఉంటున్నారు.
ఈమె ఇంటింటికీ వెళ్లే చీరలు, ఇతర దుస్తులు విక్రయించుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. ఇటీవల తన ఇంటిని అమ్మేస్తున్నానని, ఖాళీ చేయాలని ఇంటి యజమాని బి.పీర్లు గౌతమికి తెలిపారు. ఇంటిని ఆమె రూ.12.5 లక్షలకు కొనేందుకు ముందుకొచ్చి, ఈ యేడాది మే నెలలో రూ.5 లక్షలు అడ్వాన్సు చెల్లించారు.
ఇంటి యజమాని ఇటీవల మళ్లీ ఆమెను ఇల్లు ఖాళీచేయాలని ఒత్తిడి చేశారు. గతంలో ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి చెల్లిస్తే ఇంటిని ఖాళీ చేస్తానని ఆమె చెప్పారు. గత నెల 25వ తేదీన గౌతమి ఇంట్లో లేనిసమయంలో పీర్లుతో పాటు మరో ఐదుగురు వచ్చి ఆమె కుమార్తెను దూషిస్తూ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు.
అనంతరం ఈ నెల 13వ తేదీన మరోసారి పీర్లు అతని కుటుంబసభ్యులు వచ్చి గౌతమిని, ఆమె కుమార్తెను బయటకు తోసేసి ఇంట్లోని సామగ్రిని బయట పారేసి ఇంటికి తాళం వేశారు. దీంతో గౌతమి అదేరోజు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు ఆ ఐదుగురిపై కేసు నమోదుచేశారు.
ఇంటికి తాళం వేసినా గౌతమి వరండాలోనే కుమార్తెతో కలిసి ఉంటున్నారు. పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు న్యాయం చేయాలని కోరినా పోలీసులు స్పందించలేదు. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గేటుకు తాళం వేశారు.
దీంతో అవాక్కయిన సీఐ మరడాన శ్రీనివాసరావు, ఎస్ఐ అసిరితాత, సిబ్బంది ఆమెను తీసుకుని కృష్ణరాయపురంలోని అపార్టుమెంటు వద్దకు తరలివెళ్లారు. ఇంటి యజమాని కుటుంబసభ్యులతో మాట్లాడి వెంటనే గౌతమి సామగ్రిని ఇంట్లోకి చేర్పించి ఆమెకు తాళాలు అప్పగించాలని ఆదేశించారు.