Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతిని సీఎం దృష్టికి తీసుకువెళ్తా: మంత్రి కొడాలి నాని

లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతిని సీఎం దృష్టికి తీసుకువెళ్తా: మంత్రి కొడాలి నాని
, ఆదివారం, 29 నవంబరు 2020 (19:11 IST)
లారీల ద్వారా ధాన్యం రవాణాకు అనుమతులు ఇప్పించాలన్న ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతిని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు.

ఆదివారం స్థానిక రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ గోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు, ట్రెజరర్ నాదెళ్ల కృష్ణ తదితరులు కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు బోర్డర్లలో ఆగిపోయిన ధాన్యం లారీల సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే స్పందించి ఒక్కరోజులోనే ఆయా సమస్యలను పరిష్కరించడంతో పాటు బోర్లలో నిలిపివేసిన లారీలను విడుదల చేయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఆ సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు లారీల యజమానులు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ లారీల ద్వారా ధాన్యం రవాణాను  ఆంధ్రప్రదేశ్ కు నిలిపివేశామని చెప్పారు. లారీ యజమానులు ఆపినప్పటికీ రైస్ మిల్లుల యజమానులు రైల్వే వ్యాగన్ల ద్వారా ధాన్యం తోలకాలు జరుపుతున్నారని అన్నారు.

దీనిపై లారీల యజమానులు అందరూ ఎంతో అసహనంతో ఉన్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి బయట రాష్ట్రాలకు వెళ్లే లారీలకు తిరుగు ప్రయాణంలో ధాన్యం తప్ప ఇతర లోడింగ్ లు చాలా తక్కువగా ఉంటాయన్నారు. దాదాపు రెండు నెలల పాటు ధాన్యం కిరాయిలు దొరుకుతాయన్నారు.

ఈ సమయంలో ధాన్యం తోలితేనే లారీలకు ట్రిప్పులు పడతాయని,  లేకపోతే రిటర్న్ లోడ్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. మిల్లర్లు వ్యాగన్ల ద్వారా ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకు వస్తూ ఉండడం వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం చేకూరుతుందన్నారు.

వ్యాగన్ల ద్వారా వచ్చే సరుకును లారీల ద్వారా తీసుకు వస్తే వేలాది లారీలకు పని దొరుకుతుందని, ఆ లారీలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందని తెలిపారు.

ఇప్పటికైనా స్పందించి ధాన్యం తోలకాలకు సంబంధించి లారీలకు అనుమతులు ఇప్పించాలని కోరారు. రవాణాకు సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన ధాన్యానికి అనుమతి ఇస్తే వాటిని మాత్రమే రవాణా చేస్తామన్నారు. అవసరమైతే బోర్డర్లలో సిబ్బంది ద్వారా తనిఖీలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

రాష్ట్ర ప్రజల్లో లారీ యజమానులు కూడా భాగమేనని, తమకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ లారీ యజమానుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లారీల ద్వారా ధాన్యం రవాణాకు సంబంధించిన అనుమతులపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. లారీ యజమానులను ఇబ్బందులు పెట్టే నిర్ణయం ప్రభుత్వం తీసుకోదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: కృష్ణా జిల్లా కలెక్టర్