అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో పవన్ కల్యాణ్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులను బొలిశెట్టి ఈ సందర్భంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు.
అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అవకాశం ఉంటే న్యాయపోరాటం చేస్తామని, అందుకు సహకరించాలని బొలిశెట్టి కోరారు. పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాను ప్రస్తావించారు. ఈ విషయాలపై పవన్ కల్యాణ్ స్పందించారు.
అధికార పార్టీ వేధింపులపై అవసరమనుకుంటే స్వయంగా వచ్చి గూడెంలో కూర్చుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే గూడెంలో పోటీ చేస్తానంటూ ఉత్సాహపరిచారు.
భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాత మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని పవన్ తెలిపారు. ఆ మేరకు పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు.
సమీక్షలో గూడెం నాయకులు వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమోగుల సురేశ్, మారిశెట్టి అజయ్, మారిశెట్టి పోతురాజు, అడపాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.