Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతపురం మేయర్ ఎవరో?

అనంతపురం మేయర్ ఎవరో?
, సోమవారం, 15 మార్చి 2021 (10:38 IST)
అనంతపురం నగరపాలకసంస్థని గెలుచుకొన్న వైసీపీ మేయర్‌గా ఎవరిని నియమిస్తుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ నెల 18వ తేదీన మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆలోగా మేయర్‌ అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది.

అయితే వైసీపీలో నేతలు రెండు వర్గాలుగా ఉన్నారు. ఒక వర్గం కావటి శివనాగ మనోహర్‌నాయుడుకి అండగా ఉండగా మరోవర్గం పాదర్తి రమేష్‌గాంధీ పక్షాన నిలుస్తోంది. బుధవారంలోపే వైసీపీ పెద్దలు కూర్చుని మేయర్‌ అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో రెండున్నర సంవత్సరాలు(ఫీఫ్టీ-ఫిఫ్టీ) ఫార్ములాని కూడా అమలు చేయవచ్చని చెబుతున్నాయి. 
 
వైసీపీ మేయర్‌ పీఠం కోసం తొలి నుంచి సీనియర్‌ నాయకుడు కావటి మనోహర్‌నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గతంలో వైసీపీలో యువత విభాగానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నాలుగేళ్లపాటు కొనసాగారు.

పెదకూరపాడు టిక్కెట్‌ ఖాయమని భావించిన తరుణంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ టిక్కెట్‌ నంబూరి శంకరరావుకు పార్టీ అధిష్టానం కేటాయించింది. ఆ సమయంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌ బొత్స సత్యన్నారాయణ వచ్చి మనోహర్‌కి మేయర్‌గా అవకాశం కల్పిస్తామని పెదకూరపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రకటించారు.

అలానే 2019 జనరల్‌ ఎలక్షన్స్‌లో మచిలీపట్నం ఇన్‌ఛార్జ్‌గా మనోహర్‌ వ్యవహరించారు. కాగా తనకు పార్టీ హైకమాండ్‌ ఇచ్చిన హామీ తప్పక నిలబెట్టుకొంటుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఎన్నికల్లో ఆయన సత్తా చాటారు. దాదాపుగా 3,837 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 
 
ఇదిలావుంటే సార్వత్రిక ఎన్నికలకు ముందే పాదర్తి రమేష్‌గాంధీ వైసీపీలో చేరారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అండదండలు ఉన్నాయి. గాంధీ కూడా మేయర్‌ పీఠాన్ని ఆశిస్తున్నారు. తనకు రెండున్నర సంవత్సరాల పాటు మేయర్‌ పదవి ఇస్తామని అందరి నాయకుల సమక్షంలో ప్రకటన కూడా చేశారని చెబుతున్నారు.

గాంధీ 1,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరు నాయకులు పోటీ పడుతుండటంతో వైసీపీ అధిష్టానం చెరి రెండున్నర సంవత్సరాల విధానానికి మొగ్గు చూపుతుందా లేక గతంలో మనోహర్‌కి ఇచ్చిన హామిని అమలు చేస్తుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ రెండున్నర సంవత్సరాల విధానం అమలు చేసేటట్లు అయితే తొలి పర్యాయం ఎవరికి కేటాయిస్తారని కూడా ఆసక్తిగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18న తిరుపతి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక