తిరుపతిలోని జంతుప్రదర్సనశాలలో తెల్లపులి పిల్లలు సందర్సకులను కనువిందు చేస్తున్నాయి. జూపార్కులోనే ప్రత్యేక ఆకర్షణగా తెల్లపులి పిల్లలు నిలుస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు తెల్లపులిపిల్లలను చూస్తున్న సందర్సకులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పులిపిల్లలను చూసేందుకు తిరుపతి జూపార్కుకు సందర్సకులు క్యూకడుతున్నారు.
ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్సనశాలలో ఐదు తెల్లపులిపిల్లలను పర్యాటకుల చూసే అవకాశాన్ని జూ అథారిటీ అధికారులు ప్రారంభించారు. తెల్లపులిపిల్లలకు 8నెలల వయస్సు. ఈ యేడాది మార్చి నెలలో తెల్లపులులైన సమీర్, రాణిలకు మూడు మగ, రెండు ఆడపిల్లలు పుట్టాయి. చిన్నవి కావడంతో సందర్సకులను చూడకుండా వాటిని జూ అధికారులు పెంచుతూ వచ్చారు. అయితే 8 నెలల కాలం కావడంతో సందర్సకులు చూసే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు తెల్లపులిపిల్లలను చూసేందుకు సమయాన్ని నిర్ధేశించారు. తిరుమల శ్రీవారి దర్సనంతో పాటు చిత్తూరుజిల్లాలో పుణ్యక్షేత్రాల సందర్సనకు వచ్చే భక్తులు, పర్యాటకులు అధికసంఖ్యలో జూ పార్కుకు వస్తున్నారు. జూపార్కులో తెల్లపులిపిల్లలను గురించి తెలుసుకుని ఆసక్తిగా వాటిని చూసేందుకు క్యూ కడుతున్నారు పర్యాటకులు.
తెల్లపులిపిల్లలు ఎంతో ముద్దుగా ఉన్నాయని.. అంతరించిపోతున్న పులి జాతులను కాపాడేందుకు జూ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని పర్యాటకులు అభినందిస్తున్నారు. మరోవైపు ఐదు తెల్లపులిపిల్లలు పుట్టడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడం తిరుపతి జూ చరిత్రలో ఇదే ప్రథమమంటున్నారు నిర్వాహకులు.
సాధారణంగా అయితే రెండు, మూడు పులిపిల్లలు మాత్రమే పుడుతుంటాయని.. అవి కూడా పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉంటాయన్న నమ్మకం ఉండదని..కానీ ప్రస్తుతం రాణికి జన్మించిన ఐదు పిల్లలు మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయంటున్నారు కేర్ టేకర్.
వీకెండ్స్‌లో జూపార్కుకు వచ్చే సందర్సకుల సంఖ్య మరింత పెరుగుతోంది. జూపార్కుకు వచ్చిన పర్యాటకులకు ప్రవేశమార్గంలోనే తెల్లపులిపిల్లల గురించి జూ అధికారులు వివరిస్తుండడంతో నేరుగా పర్యాటకులు వాటి వద్దకు వెళ్ళి సందర్సిస్తున్నారు. గతంలో జూపార్కులో పర్యటించిన పర్యాటక శాఖామంత్రి తెల్లపులులకు జగన్, వాసు, సిద్థాన్, దుర్గ అని నామకరణం కూడా చేశారు.