Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డీజీపీ స్థానంలో ఉన్నవ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఎలా?: టీడీపీ

Advertiesment
DGP
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:23 IST)
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మతాలమధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...!

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ మతాన్ని గాయపరిచే నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు చేపట్టడం గానీ జరగలేదు. మతసామరస్యం అనేది మచ్చుకైనా సరే ఎక్కడా దెబ్బతినకుండా, ఏమతస్తులకు అన్యాయం జరగకుండా ఎన్టీఆర్, చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించారు.

దురదృష్టవశాత్తూ జగన్ ముఖ్యమం త్రయ్యాక హిందూ దేవాలయాలపై దాడులు, దేవాదాయ భూములను లాక్కోవడం, రథాలు తగులబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం వంటివి నిత్యకృత్యాలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర డీజీపీ ఒక ప్రసారమాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యదూరమైన మాటలు మాట్లాడారు. అంతర్వేది ఘటనతోనే దేవాలయాలపై దాడులు ప్రారంభమయ్యాయని డీజీపీ చెప్పారు.

చెడుసావాసాలు పడితే వాళ్లు వీళ్లవుతారని చెబుతుంటారు. కృష్ణాపుష్కరాల సమయంలో విజయవాడ సీపీగా సమర్థవంతంగా పనిచేసిన గౌతమ్ సవాంగ్, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరిస్తూ, తాడేపల్లి ప్యాలెస్ కి సరెండర్ అయ్యారు. డిఫ్యాక్టో హోంమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ, ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ నే డీజీపీ చదువుతున్నట్లుగా ఉంది.

అంతర్వేధి సంఘటన జరగకముందే, పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం కాలేదా.. బిట్రగుంటలో రథం తగలబడలేదా? ఇవేవీ ప్రజలకు తెలియవన్నట్లు డీజీపీ మాట్లాడితే ఎలా? ప్రజలు తిరగబడి, ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని నిర్ణయించుకున్నాకే,  అంతర్వేది ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.

ముందుగా అంతర్వేదికి టీడీపీ తరుపున నిజనిర్ధారణ బృందాన్ని పంపిందే తెలుగుదేశం. దేవాలయాలపై, హిందూమతంపై జరుగతున్న దాడులన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ తొలినుంచీ డిమాండ్ చేస్తోందని డీజీపీ తెలుసుకోవాలి.

అంతర్వేది ఘటన జరిగాక, గత మూడువారాల్లో 19 ఘటనలు దేవాలయాలపై జరిగాయని డీజీపీ ఒక నిజమైతే ఒప్పుకున్నారు గానీ, 12 ఘటనలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేస్తే, ఒక్కరిని కూడా మీడియాముందుకు ఎందుకు తీసుకురాలేదో, నిందితులు ఎక్కడ మాయమయ్యారో డీజీపీ చెప్పాలి. అరెస్ట్ లు చేయకుండానే ప్రజలను నమ్మించే ప్రయత్నాలుచేయాలని డీజీపీ చూస్తున్నారా? డీజీపీ స్థానంలో ఉన్నవ్యక్తి తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం ఏదిపడితే అది మాట్లాడితే ఎలా?

దేవాలయాలపై దాడులు, ఇతరఘటనలకు సంబంధించి డీజీపీ చెప్పిన నివేదికలో 2015లో 290,  2016లో 322,  2017లో 318,    2018లో 267, 2019లో 305, 2020లో కేవలం 228 ఘటనలు మాత్రమే జరిగినట్లు, గతంతో పోలిస్తే, చాలావరకు తగ్గాయని డీజీపీ చెబుతున్నారు. 

తమపోలీసులు సమర్థవంతంగా పనిచేయబట్టే, ఘటనలు దాడులు తగ్గాయంటున్న ఆయన, విజయవాడలోని దేవాలయంలో మూడు వెండి సింహాలు మాయమైతే, మూడురోజులవరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని తెలుసుకోవాలి. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా, చోరీ జరిగిన మూడురోజులకు కేసు నమోదుచేశారని డీజీపీకి తెలియదా? ఇదేనా పోలీసుల సమర్థతా?

పటిష్టమైన భద్రతే దేవాలయాలకు కల్పించి ఉంటే, ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎందుకు దాడులు, విగ్రహధ్వంసాలు జరుగుతున్నాయో పోలీస్ బాస్ చెప్పాలి.  నేషనల్  క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) నివేదిక ప్రకారం చూస్తే, పేజీనెం-8లోచూస్తే 2015లో రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలురెచ్చగొట్టే సంఘటనలు 27మాత్రమే జరిగాయి. మరి డీజీపీ 290 దాడులు దేవాలయాలపై జరిగాయని  ఎలా చెబుతారు? 

2016లో 322 సంఘటనలు జరిగాయని డీజీపీ చెప్తే, ఎన్ సీఆర్ బీ లెక్కల  ప్రకారం కేవలం 14 మాత్రమే జరిగాయి. అలానే 2017లో డీజీపీ లెక్కలప్రకారం 318 సంఘటనలు జరిగితే, ఎన్ సీ ఆర్ బీ గణాంకాల ప్రకారం 33 కేసులు మాత్రమే ఫైల్ అయ్యాయి. 318 ఎక్కడో, 33 ఎక్కడో డీజీపీ తెలుసుకోవాలి. 2018లో ఎన్ సీ ఆర్ బీ నివేదిక ప్రకారం 14 ఘటనలు జరిగితే, డీజీపీ 267 అని చెప్పారు.

అదేవిధంగా 2019లో 305 ఘటనలు జరిగితే, 2020లో 228 జరిగినట్లు తనకు తానే  డీజీపీ ఒప్పుకున్నాడని, తద్వారా ఆయన వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలను తననోటితో తనే చెప్పాడు.   వందల సంఖ్యలో దాడులు జరిగాయని డీజీపీ చెబితే, ఎన్ సీఆర్ బీ మాత్రం పదుల సంఖ్యలోజరిగాయని చెప్పింది. వాస్తవాలు అలా ఉంటే, డీజీపీ తప్ప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఎలా?

ఎన్ సీ ఆర్ బీ నివేదిక తప్పు అనిచెప్పే ధైర్యం డీజీపీకి ఉందా? దీపావళి నాడు బాణసంచా పడి పశ్చిమగోదావరిలో రథం తగలబడితే, అది ప్రమాదవశాత్తూ జరిగిందని మీడియాలో కూడా వచ్చింది. నిజాలను రూపుమాపాలని చూస్తే ఎలా?  
విజయవాడలో  కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మించినా ఎక్కడా కూడా ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్చిలు, మసీదులు, గుడులు అలానే ఉన్నాయని తెలుసుకోండి.    

అంతర్వేది తరువాతకూడా వరుసగా దాడులు జరుగుతున్నాయంటే, అవన్నీ మతాలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పథకంలో భాగంగా జరుగుతున్నవని డీజీపీకి తెలియదా? రాజకీయ స్వార్థంకోసం, సమాజాన్ని ముక్కలు చేయడానికే హిందూమతంపై దాడి జరుగుతోంది. పాలకులు తమస్వార్థానికి అధికారులను వాడుకుంటున్నారు.

డీజీపీ తనకున్న విశ్వసనీయత నిలుపుకుంటే మంచిది. నేరచరిత్ర కలిగిన ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయినంతమాత్రాన దిగజారిపోయి, రాష్ట్ర హైకోర్టుతో అక్షింతలు వేయించుకునే స్థాయికి డీజీపీచేరడం సిగ్గుచేటు. దేవాలయాలపై, దళితులపై, జరుగుతున్న దాడుల్లో  ఏ ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నట్లు చెప్పగలరా?

భవిష్యత్ లో తెలుగుదేశంపై బురదజల్లే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వేసే మాస్టర్ ప్లాన్ లో భాగంగా డీజీపీ పావుగా మారబోతున్నారా? అందుకే వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారా? ప్రజలు వాస్తవాలు అర్థంచేసుకుంటున్నారనే విషయాన్ని ప్రతి అధికారి గ్రహిస్తే మంచిది.

వాస్తవాలు, ఆధారాలతో వైసీపీ ప్రభుత్వ కుట్రలను టీడీపీ ఎప్పుడూ తిప్పికొడుతూనే ఉంటుందని రాష్ట్ర అధికార యంత్రాంగం తెలుసుకుంటేమంచిది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇప్పటికైనా నిజానిజాలు గుర్తించి దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా కోవిడ్ హాస్పిటల్స్ అగ్రస్థానం