Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తాం: మంత్రి కొడాలి నాని

Advertiesment
free electricity
, శనివారం, 10 అక్టోబరు 2020 (23:01 IST)
రాష్ట్రంలో వచ్చే 30-35 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్‌లోని నివాసంలో వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పోస్టర్లను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతుల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క వ్యవసాయ కలెక్షన్‌ని కూడా తొలగించే పరిస్థితి ఉండ‌దని, ఉన్న కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని పేర్కొన్నారు. జగన్మోహన్న్‌డ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పగటిపూట 9గంటల పాటు విద్యుత్ ఇచ్చేందుకు ఫీడర్లను పరిశీలించడం జరిగిందని, 40శాతం ఫీడర్ల మౌలిక సదుపాయాలు లేవని గుర్తించారన్నారు.

ఈ పరిస్థితులను మార్చేందుకు అప్ గ్రేడేషన్ పనుల కోసం రూ.1700 కోట్లు కేటాయించారన్నారు. దీంతో 89శాతం ఫీడర్లలో పగటిపూటే 9గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను ఇవ్వడం జరుగుతుందన్నారు.2019 మార్చి 31 నాటికి గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద డిస్కంలకు రూ.8వేల కోట్లు బకాయిలు పెట్టిందని, ఈ బకాయిలను సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లించడంతో పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి అన్ని చర్యలూ తీసుకున్నారన్నారు.

రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 30 నుండి 35ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఎటువంటి ఢోకా రానివ్వకుండా 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. దీనివల్ల యూనిట్ విద్యుత్ రూ.2.50కే సమకూరింద‌న్నారు. త‌ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని, ఉచిత విద్యుత్ పథకం స్థిరంగా, నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.

విద్యుత్ రంగంలో కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఎంత వాడుతున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నామో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లిస్తారని, నాణ్యమైన విద్యుత్, పగటిపూట 9గంటల పాటు రాకపోతే రైతులే డిస్కంలను నిలదీయవచ్చన్నారు.

ఈ ప్రక్రియలో రైతులపై ఒక్క పైసా భారం కూడా పడదని, ఉన్న ప్రతి కనెక్షన్ కొనసాగు తుందన్నారు. ఈ సంస్కరణల వల్ల కౌలు రైతులకు కూడా ఎటువంటి సమస్య‌ ఉండదన్నారు. విద్యుత్ మీటర్లకు అయ్యే ఖర్చులను డిస్కంలు, ప్రభుత్వం భరిస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.8 వేల కోట్లకు పైగా ఉచిత విద్యుత్ కోసం ఖర్చు అవుతుందని, దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు.

వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని డిసెంబర్ 1వ తేదీ నుండి శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్ పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వడంతో పాటు రైతులకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి కొడాలి నాని ఆదేశించారు.

కార్యక్రమంలో గుడివాడ ఎలక్ట్రికల్ డీఈ పి.హరిబాబు, ఏడీఈ జి.వెంకటేశ్వర్లు, రూరల్ ఏడీఈ ధూళిపాళ్ళ విశ్వేశ్వరప్రసాద్, ఏఈలు భానుప్రకాష్, శ్రీనివాసరావు, కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంప్ర‌దాయాల ప్ర‌కార‌మే సిరిమానోత్స‌వం: మంత్రి బొత్స