Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకోం: రాజ్యసభలో విజయసాయి రెడ్డి

Advertiesment
privatization
, సోమవారం, 22 మార్చి 2021 (22:20 IST)
న్యూఢిల్లీ: వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా భాసిల్లుతున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ఒక్క కలం పోటుతో ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత మాత్రం సమర్ధించబోదని రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లుపై ఈరోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనానికిక అవసరమైన ప్రణాళిక, చర్యలను రూపొందించడానికి బదులుగా వాటిని ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు తమపై ఉంచిన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశలో పని చేస్తాయి. తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ప్రైవేట్‌ రంగ సంస్థలు కొంత మేర ఉపాధి కల్పించినా లాభార్జనే ఏకైక ధ్యేయంగా కంపెనీలను నడుపుతాయని ఆయన అన్నారు.
 
నిర్ణీత కాలపరిమిలో రాష్ట్ర ప్రభుత్వం గనుల వేలంను నిర్వహించలేని పక్షంలో ఆ గనులను వేలం వేసే హక్కును కేంద్ర ప్రభుత్వం పొందేలా బిల్లులో ప్రతిపాదించారు. ఇది భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న ఫెడరల్‌ స్ఫూర్తికే విరుద్ధం. నిర్ణీత కాలపరిమితి అనే సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి ఏడేళ్ళు అవుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.

ఉదాహరణకు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక రైల్వే జోన్‌ హామీ ఏడేళ్ళైనా కార్యరూపం దాల్చలేదు. హామీని నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసి తదనంతరం ఆ జోన్‌ను రైల్వేకు బదిలీ చేసే అధికారం రాష్ట్రానికి ఇస్తారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు కింద కేంద్ర, రాష్ట్రాల అధికారాల స్పష్టమైన విభజన జరిగింది. ఒకరి అధికారాలను మరొకరు హరించకుండా రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన దుయ్యబట్టారు.
 
వాణిజ్యపరమైన అవసరాల కోసం ప్రైవేట్‌ సంస్థలకు గనుల కేటాయింపు జరగడానికి వీలుగా ఈ బిల్లులో నిబంధనలను పొందుపరచారు. ప్రైవేట్‌ సంస్థలకు మైనింగ్‌ హక్కులు కట్టబెట్టడం తప్పు లేదు. కానీ ముందుగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు సంపూర్ణంగా జరిగిన తర్వాత మాత్రమే మిగిలిన గనులను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని ఆయన సూచించారు.

ఇప్పటి వరకు అమలులో ఉన్న టన్ను ఖనిజానికి ఇంత మొత్తం రాయల్టీ మైనింగ్‌ లీజుదారుడు చెల్లించే నిబంధన స్థానంలో మైనింగ్‌ ఆదాయంలో ప్రభుత్వం వాటా పొందేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీని వలన 50 మైనింగ్‌ బ్లాక్‌లు ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళతాయి. ఈ బ్లాక్‌ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. అయితే పవర్‌ ప్లాంట్‌ల నుంచి రావల్సిన 17 వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టలేక కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ఈరోజు తీవ్రమైన ఆర్థిక వత్తిళ్ళను ఎదుర్కొంటోంది.

పవర్‌ ప్లాంట్‌ల నుంచి బకాయిలను రాబట్టి కోల్‌ ఇండియాను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. తద్వారా ఆ సంస్థలో పని చేస్తున్న వేలాది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు దన్ను చేకూర్చేలా ఉన్న ఈ బిల్లును నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులందరూ సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు.
 
స్టీల్‌ ప్లాంట్‌లకు కోకింగ్‌ కోల్‌ కొరత ఉంది.. రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అంగీకరించారు. సొంత బొగ్గు గనులు లేక ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి వచ్చాయా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ దేశంలో కోకింగ్ కోల్ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటన్నట్లు చెప్పారు.
 
స్టీల్ ప్లాంట్లకు అవసరమయ్యే కోకింగ్ కోల్ దేశంలో తగినంత పరిణామంలో అందుబాటులో లేదు. స్టీల్‌ ప్లాంట్‌లలో తక్కువ బూడిద పరిణామం కలిగిన (లోయాష్‌) కోకింగ్‌ కోల్‌ను మాత్రమే వినియోగిస్తారు. మన దేశంలో శుభ్రపరచని కోకింగ్ కోల్‌లో బూడిద సగటున 22 నుంచి 35 శాతం ఉంటుంది. సాంకేతికంగాను, పర్యావరణ పరిరక్షణ పరంగాను స్టీల్‌ ప్లాంట్‌లలో వినియోగించే కోకింగ్‌ కోల్‌లో బూడిద 10 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలి. దేశంలో లభ్యమయ్యే కోకింక్‌ కోల్‌ను శుభ్రపరిచిన తర్వాత కూడా అందులో బూడిద 18 నుంచి 20 శాతం వరకు ఉంటుంది. అందుకే స్టీల్‌ కంపెనీలు తమకు అవసరమైన లోయాష్‌ కోకింగ్‌ కోల్‌ను అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
 
దేశంలో వివిధ స్టీల్‌ ప్లాంట్లకు ప్రభుత్వం కేటాయించిన సొంత బొగ్గు గనుల వివరాలను మంత్రి వెల్లడిస్తూ 2015లో గనులు, ఖనిజాల చట్టం సవరించిన అనంతరం ఈ ఆక్షన్‌ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుగుతున్నట్లు చెప్పారు. వాణిజ్యపరమైన అవసరాల కోసం బొగ్గు గనుల బ్లాక్‌ కేటాయింపు ఇటీవల కాలంలో ప్రారంభమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమ బొగ్గు అవసరాల కోసం ఈ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటల రాజేందర్‌ను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన మంత్రి కేటీఆర్, ఎందుకో?