Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేం కుల, కుటుంబ రాజకీయాలు చేయం: పవన్‌

మేం కుల, కుటుంబ రాజకీయాలు చేయం: పవన్‌
, ఆదివారం, 10 జనవరి 2021 (09:45 IST)
ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తామని, వాటి కోసమే పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మాటలు తూలనని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తనను సంస్కారవంతంగా పెంచారని ఆయన అన్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా? అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు పవన్‌ మద్దతు తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు.

అనంతరం కొత్తపాకలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనకు ఓటు వేయకున్నా సైద్ధాంతిక బలంతోనే నిలబడ్డానని అన్నారు. తనకు ఆస్తులు, అధికారాలు అక్కర్లేదని, ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. కష్టపడి పని చేసి పిల్లలకు ఏమైనా ఇవ్వొచ్చని, కానీ, ఆరోగ్యం ఇవ్వగలమా? అని పవన్‌ ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే పరిశ్రమలు వద్దని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ‘‘ నేను పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తిని. కాలుష్యం దృష్ట్యా దివిస్‌ పరిశ్రమ వద్దని గతంలో మీరే డిమాండ్‌ చేశారు. అలాంటి పరిశ్రమలకు ఇప్పుడు మీరే అనుమతులు ఇస్తున్నారు. దివిస్‌ పరిశ్రమ నుంచి పెద్దమొత్తంలో కాలుష్య జలాలు వస్తాయి. వీటివల్ల సముద్ర జీవులు చనిపోతాయి. కాలుష్య జలాలను శుద్ధి చేసే విధానాలను ప్రోత్సహించాలి. అలాకాకుండా మీ లాభాల వేటలో పేదప్రజలను రోడ్డు పైకి తెస్తున్నారు’’ అని పవన్‌ మండిపడ్డారు. 

రాజకీయ నాయకులకు ప్రజలే విలువలు నేర్పించాలని పవన్‌ వ్యాఖ్యానించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.‘‘ అనేక మంది నుంచి వేల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టారు. దివిస్‌ పరిశ్రమకు 690 ఎకరాలు ఇచ్చారు.. వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? దివీస్‌లో మొత్తం 1,500 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కాలుష్య పరిశ్రమలు తెస్తే ప్రజలకు ఎక్కడికి వెళ్లాలి? మేం కుల, కుటుంబ రాజకీయాలు చేయం.

వేల కోట్లు సంపాదించాలనే కోరిక నాకు లేదు. సామాజిక ప్రభావ అంచనా వేయకుండా పరిశ్రమలకు భూములు ఇస్తారా? వైకాపాకు చెందిన రాంకీ ద్వారా అంచనా వేయించారు. దివీస్‌ పరిశ్రమ కాలుష్యం మత్స్య సంపదను నాశనం చేయదని హామీ ఇవ్వాలి. కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి వ్యాధులూ రావని హామీ ఇవ్వాలి’’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇంత కాలుష్యం వెదజల్లుతుంటే పీసీబీలు ఏం చేస్తున్నాయని పవన్‌ ప్రశ్నించారు. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ‘‘వ్యాధులు లేని సమాజాన్ని కోరుకుంటున్నాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను రానివ్వబోమని మీరే చెప్పారు. దివిస్‌ పరిశ్రమ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. కాలుష్య జలాలు రావని దివిస్‌ యాజమాన్యం హామీ ఇవ్వగలదా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దడ పుట్టిస్తున్న వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్... ఇందులో మీకు ఎంత తెలుసు?