ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. వలంటీర్లుగా పని చేసే అనేక మంది వివిధ రకాలైన నేరాలకు ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వాలంటీర్ వ్యవహారశైలి భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. దీంతో వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం రావులపాడులో ఒక వాలంటీర్ సమాచారం కోసమంటూ ఓ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వేధించసాగాడు. ఇది భర్తకు తెలియడంతో ఆ దంపతుల మధ్య మనస్పర్థలు చెలరేగి వివాదానికి దారితీసింది. దీంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగి బుధవారం ఆ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.