విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్థరాత్రి తీరానికి కొట్టుకొచ్చిన ఓ యువత మృతదేహం కలకలం రేపిన విషయం తెల్సిందే. మృతురాలిని గురువెల్లి శ్వేత(24)గా పోలీసులు గుర్తించారు. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. అంతలోనే కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న బీచ్‌లో మృతదేహం ఇసుకలో కూరుకుపోవడం, లోదుస్తులు మాత్రమే ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మూలపేట. తండ్రి లేరు. తల్లి రమ. విశాఖ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ దొండపర్తిలో ఉంటున్నారు. ఏడాది క్రితం గాజువాక సమీపంలో ఉక్కు నిర్వాసిత కాలనీకి చెందిన మణికంఠతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి. 15 రోజుల క్రితం ఆఫీసు పని నిమిత్తం మణికంఠ హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో అత్తమామలతో కలిసి ఉంటున్న శ్వేత.. మంగళవారం సాయంత్రం అత్తతో గొడవపడినట్టు సమాచారం. ఆ తర్వాత అత్తమామలిద్దరూ పనిమీద బయటకు వెళ్లారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్వేత.. తన భర్త మణికంఠకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. కుటుంబపరమైన అంశాలపై వారి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఫోన్ కట్ చేసి ఇంటికి తాళాలు వేసి పక్కింటిలో ఇచ్చి రాత్రి 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయింది. కాసేపటికి ఇంటికి వచ్చిన అత్తమామలు.. శ్వేత పక్కింట్లో ఇచ్చిన తాళాలు తీసుకుని తలుపులు తీసి చూడగా.. శ్వేత తన భర్తకు రాసి ఉంచిన ఉత్తరం కనిపించింది.
వారు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత 2 గంటల సమయంలో ఆర్కే బీచ్ తీరంలో ఇసుకలో ఓ యువతి మృతదేహం కూరూకునివున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లి చూసిన పోలీసులకు ఆ మృతదేహం శ్వేతదిగా గుర్తించారు.
అయితే శ్వేత తన భర్తను ఉద్దేశించి రాసిన లేఖలో.. "నాకు ఎపుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం బాధ ఉండదని. ఏదేమైనా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. న్యూ లైఫ్.. చాలా మాట్లాడానికి ఉన్నా కూడా.. నేను ఏమీ మాట్లాడటం లేదు. యూ నో ఎవ్రీథింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంటూ శ్వేత సూసైడ్ లేఖ రాసింది. ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ స్మైలీ బొమ్మ వేసిన ఆ లేఖను శ్వేత గదిలో పోలీసులు గుర్తించారు.