విశాఖలో లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేధింపుల కారణంగా మంగళవారం 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడిని నరేంద్రగా గుర్తించారు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలను బంధువులకు పంపుతామని బాధితుడిని బెదిరించినట్లు సమాచారం.
మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర (21) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగి 40 రోజులైంది. దంపతులిద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నరేంద్ర లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకుని కొంత చెల్లించేశాడు. మరో రూ.2వేలు మాత్రమే బాకీ ఉంది.
ఇటీవల ఆ డబ్బులు చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. అతడి భార్య ఫోన్‌కు మార్ఫింగ్ ఫొటోలు పంపి నరేంద్రతో వెంటనే డబ్బులు కట్టించాలని, లేకుంటే మరిన్ని ఫొటోలు పంపిస్తామని బెదిరించారు. ఈ విషయం తెలిసి రెండు వేలు భార్యాభర్తలిద్దరూ చెల్లించేశారు.
అప్పటికే యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫొటోలను నరేంద్ర ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ పంపించేశారు. దాన్ని తీవ్ర అవమానంగా భావించిన నరేంద్ర శనివారం అర్ధరాత్రి భార్య నిద్రలో ఉండగా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.