విశాఖపట్టణం జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ (20) ఆత్మహత్య హత్యపై పలు భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఆయన సర్వీస్ రివాల్వర్‌తో కణతపై కాల్చుకున్నారని కొందరు చెపుతుండగా, మరికొందరు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు చెపుతున్నారు. పైగా, ఆత్మహత్యాస్థలంలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.
పాడేరులో సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఏఎస్పీ బంగ్లా ఉంది. ఏఎస్పీ నివాసం, కార్యాలయుం అందులోనే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఏఎస్పీ కార్యాలయలో తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. అక్కడున్న గన్‌మెన్, హోంగార్డులు పరుగుపరుగున లోపలికి వెళ్లారు. అప్పటికే శశికుమార్ రక్తపు ముడుగులో పడివున్నారు.
కణతలోకి తూటా(లు) దూసుకెళ్లిన గుర్తులు... పక్కనే రివాల్వర్ కనిపించాయి. వెంటనే పోలీసు జీపులో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్సులో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ తరలించారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగిస్తున్నట్టు విశాఖ జిల్లా ఏఎస్‌పీ హుల్‌దేవ్‌వర్మ ప్రకటించారు.
రాత్రి 9 గంటల సమయంలో హోంమంత్రి నిమ్ముకాయల చినరాజప్ప వచ్చి ఏఎస్పీ తల్లిదండ్రులను పరామర్శించారు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. 'సూసైడ్ నోట్ ఏవైనా లభించిందా?' అని ప్రశ్నించగా, "నోట్ ఉంది. అందులో చాల సున్నితమైన అంశాలున్నాయి. శశికువూర్ కుటుంబ సభ్యులు అనుమస్తే బయుటపెడతాం" అని పోలీసులు వెల్లడించారు.
కారణమిదే...
శశికుమార్ బలవన్మరణానికి వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోంది. ఆయనకు ఇప్పటికే పెళ్లి ఖాయమైంది. సెప్టెంబరు 4న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు మూడు రోజులు సెలవు పెట్టి వస్తున్నానని రెండు రోజుల క్రితం ఆయన తన తల్లికి ఫోన్ చేసి చెప్పారు. సెలవుపై వెళ్లాల్సిన రోజే... ఆత్మహత్య చేసుకున్నారు. తను ఇష్టపడిన అమ్మాయితో కాకుండా... మరొకరితో పెళ్లి కుదర్చడంతో మనస్తాపానికి గురైనందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.