యుద్ధనౌకకు ఏపీ పాలనా రాజధాని విశాఖ పేరు పెట్టామని తూర్పు నౌకాదళం ప్రకటించడంపై నరసాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
భారత నౌకాదళంలోని యుద్ధ నౌకకు ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ తూర్పు నౌకాదళం ప్రకటించటంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు.
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనకు తూర్పు నౌకాదళం పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి మినహా మరో రాజధాని లేదని.. ముంబైలో నిర్మితమవుతున్న యుద్ధనౌకకు ఏపీ పాలనా రాజధాని పేరు పెట్టామంటూ ప్రకటించడం కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
యుద్ధ నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నంగా పేరు పెట్టడంలో ఇబ్బందేమీ లేదని పేర్కొన్న రఘురామ.. కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కమాండర్ సుజిత్ రెడ్డిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో కోరారు.
ఏం జరిగిందంటే?
ముంబై డాక్ యార్డ్‌లో "15బి గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్" యుద్ధ నౌక నిర్మాణమవుతోంది. దీనికి ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం పేరు పెట్టామంటూ తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ అయ్యింది.
తూర్పునౌకాదళ కమాండ్ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ నిన్న సీఎం జగన్‌ను కలిసి.. డిసెంబరు 4వ తేదీన జరిగే నౌకాదళ దినోత్సవానికి హాజరు కావాలంటూ ఆహ్వానపత్రిక అందించారు.
ఈ సందర్భంగా ముంబైలో నిర్మితమవుతున్న యుద్ధ నౌక 15బి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్‌కు ఏపీ పాలనా రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామని ప్రకటించారు. ఈ మేరకు వైస్ అడ్మిరల్ అజేంద్ర సింగ్ సీఎంకు వివరించినట్టుగా నౌకాదళం ప్రకటనలో వెల్లడించింది.
అయితే.. రాజధాని అంశం హైకోర్టు విచారణలో ఉండటంతోపాటు.. కేంద్ర హోంశాఖ నిర్ధరించకుండా ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నం అని నౌకాదళం తన ప్రకటనలో పేర్కొనటం చర్చనీయాంశమైంది.