భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విదేశాల్లో పర్యటిస్తున్న టీమిండియా తొలుత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. అక్కడు టెస్ట్, ట్వంటీ, వన్డే సిరీస్‌లను ఆడింది. ఈ టూర్‌ను విజయవంతంగా ముగించుకుని న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. కివీస్ గడ్డపై కూడా భారత జట్టు తన విజయ యాత్రను కొనసాగిస్తోంది.
అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఒకవైపు పరుగుల దాహం తీర్చుకుంటూనే మరోవైపు పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను సాధించిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్రపుటలకెక్కిన కోహ్లీ.. తాజాగా క్రికెట్ దిగ్గజాలు వెస్టిండీస్ మాజీ ఆటగాడు వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ దివంగత హాన్సీ క్రోనేల రికార్డును బద్ధలుకొట్టారు.
ఇప్పటివరకు 63 వన్డేలకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ 47 వన్డేల్లో భారత్‌కు విజయాలు అందించాడు. ఈ క్రమంలో 46 వన్డే విజయాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న వివియన్ రిచర్డ్స్, హాన్సీ క్రోనేలను కిందికి నెట్టేసి ఆ స్థానాన్ని కోహ్లీ ఆక్రమించాడు. 41 విజయాలతో ఆసీస్ క్రికెటర్ మిచెల్ క్లార్క్ నాలుగో స్థానంలో ఉంటే, 50 విజయాలతో దిగ్గజ ఆటగాళ్లు క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
మరోవైపు, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం ఆరు మ్యాచ్‌లకు మాత్రమే దూరమయ్యాడు. సోమవారం కివీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ ధోనీ ఆడలేదు. తొడ కండరాల నొప్పితో పాటు జ్వరం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
నిజానికి ఫిట్నెస్ విషయంలో ధోనీ చాలా జాగ్రత్తగా ఉంటాడు. మ్యాచ్, ప్రాక్టీస్ సెషన్‌లలో కూడా ధోనీ గాయపడడం అరుదు. కానీ, ధోనీ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు గాయం, జ్వరం కారణంగా 6 మ్యాచ్‌ల్లోనే ఆడలేదు. ధోనీ 2013లో ( వెస్టిండీస్‌పై) చివరిసారిగా గాయంతో ఆటకు దూరమయ్యాడు.
ఆ సిరీస్‌లోమూడు వన్డేలు ఆడలేదు. ఇక 2007లో వైరల్ జ్వరంతో ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. గాయం కారణంగా సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆడలేదు. మొత్తం ఈ సీజన్‌లో భారత కెప్టెన్, మాజీ కెప్టెన్‌లు వరుసబెట్టి రికార్డులు సృష్టిస్తున్నారు.