Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనకదుర్గ దసరా ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారంలో త‌ప్ప‌ట‌డుగులు

కనకదుర్గ దసరా ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారంలో త‌ప్ప‌ట‌డుగులు
విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (10:51 IST)
కనకదుర్గ దసరా ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారంలో ఎల్‌ఈడీ స్క్రీన్లపై కొద్ది సేపు అన్యమత ప్రచార వీడియో కనబడటం వెనక వాస్తవాలు వెలుగుచూశాయి. దసరా ఉత్సవాలను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పోటు.. అన్ని ఛానెళ్లకు లైవ్‌ ఫీడ్‌ అందించేందుకు ముందుకొచ్చిన సీ ఛానెల్‌కు దుర్గగుడి పాలక మండలి బాధ్యతలు అప్పగించింది. మూడు ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటుకు నిజామాబాద్‌కు చెందిన కీర్తితరంగా క్రియేషన్స్‌ సంస్థకు అప్పగించారు. 
 
దుర్గ గుడిలో జరిగే ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు మొదటిగా ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రసారం చేయాలి. 
ఈ ఒప్పందాన్ని సీ ఛానెల్‌ యాజమాన్యం ఉల్లఘించింది. ఇంద్రకీలాద్రి ఉత్సవాల చిత్రీకరణ ఫీడ్‌ను నేరుగా ప్రసారం చేయకుండా.. తమ కార్యాలయంలోని లైవ్‌కు అనుసంధానించింది. దీంతో ఆ ఛానెల్‌లో ఏ కార్యక్రమం ప్రసారమైతే అదే ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై కనబడుతుంది. గురువారం (అక్టోబర్‌ 7,2021) రాత్రి ఏడున్నర గంటలకు వేడుకలు ముగిసాయి. అప్పటి వరకు సీ ఛానెల్‌ వీటిని ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శించింది. ఉత్సవాలు ముగియగానే ఎల్‌ఈడీ స్క్రీన్‌లకు, సీ ఛానెల్‌ లైవ్‌కు లింక్‌ తొలగించాల్సి ఉండగా, సీ ఛానెల్‌ టెక్నీషియన్‌ కేవలం కొండపై ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ స్విచ్‌ మాత్రమే ఆఫ్‌ చేశాడు. మిగతా రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఆఫ్‌ చేయ లేదు.
 
దీంతో దసరా ఉత్సవాల ప్రసారం ముగిసిన తరువాత, సీ ఛానెల్‌లో ఇతర ప్రసారాలు మొదలయ్యాయి. కొండ కింద ఉన్న స్క్రీన్‌లపై ఆ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. రాత్రి 7.30 గంటల సమయంలో సీ ఛానెల్‌లో ప్రసారమైన వార్తలు కూడా ఎల్‌ఈడీపై వచ్చాయి. వీటితోపాటు 8 గంటలకు ఫిలడెల్పియా  చర్చికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేసింది. (చర్చితో కుదుర్చుకుందున్న ఒప్పందం మేరకు  గత 2  నెలలుగా రాత్రి ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రాసారం చేస్తోంది సీ ఛానెల్‌.) 
 
గురువారం కూడా అదే రీతిలో కార్యక్రమం ప్రసారం అయింది. ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆఫ్‌ చేయకపోవడం వల్ల జరిగిన పొరపాటు ఇది. కొంత మంది భక్తులు ఫిర్యాదు చేయడంతో.. పొరపాటు గుర్తించి ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆఫ్‌ చేసింది. సీ ఛానెల్, కీర్తితరంగా క్రియేషన్స్‌ నిర్లక్ష్యంపై విజయవాడ దుర్గ గుడి ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆఫ్‌ చేయడంలో నిర్లక్ష్యం వహించిన టెక్నీషియన్‌ను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్య మంచి సమాజానికి పునాది... ప‌ది మందిని చ‌దివించండి