విజయవాడ జిల్లాకు కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కృష్ణా కలెక్టర్ జె.నివాస్ ను ఆయన క్యాంప్ కార్యాలయంలో జైఆంధ్ర సేవా సమితి, కాకాని వెంకటరత్నం ఆశయ సాధన సమితి ప్రతినిధి బృందం కలిసింది.
ఆంధ్ర ఉక్కు మనిషిగా పేరొందిన స్వర్గీయ కాకాని వెంకటరత్నం మూడుసార్లు కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, మంత్రిగా పనిచేసి, జిల్లాలో వ్యవసాయం, పాడి పరిశ్రమల అభివృద్ధికి 1920 నుంచి 1972 వరకు విశేషంగా కృషి చేశారని కాకాని వెంకటరత్నం మనుమడు అయిన తరుణ్ కాకాని వివరించారు. 1923లో మహాత్మా గాంధీజీని విజయవాడకు తీసుకురావడంలో కూడా కాకాని వెంకటరత్నం కీలకపాత్ర వహించారని పేర్కొన్నారు.
జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని, ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రాల హక్కుల సాధన కోసం కాకాని నిలబడ్డారని, అజాత శత్రువుగా పేరొందిన కాకాని వెంకట రత్నం పార్టీలకు అతీతంగా పోరాడారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు స్ఫూర్తిగా విజయవాడ జిల్లాకు కాకాని పేరు పెట్టాలని కలెక్టర్ జె.నివాస్‌కు తరుణ్ కాకాని సూచించారు.
విజయవాడలోకి కాకాని సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునరావిష్కరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, నూజివీడు మండలాన్ని ఏలూరులో కాకుండా, విజయవాడ జిల్లాలో కలపాలని కాకాని ఆశయ సాధన సమితితోపాటు, జై ఆంధ్ర సేవా సమితి ప్రతినిధులు, జైరాజ్ సందెపు, ఆకునూరు సర్పంచి కాకాని విజయ్ కుమార్ తదితరులు కలెక్టరును కలిసి వినతపత్రం సమర్పించారు.