ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి విజయ.కె సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం విజయవాడలో ఎపిటిఎ కార్యాలయంలో సంస్ధ అధికారుల సమక్షంలో చార్జ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (సిటిసి)పై సంతకం చేసారు. అనంతరం పర్యాటక, బాషా సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను మర్యాద పూర్వకంగా కలిసారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన విజయ తన సర్వీసు తొలిరోజులలోనే ప్రత్యేకతను చాటుకున్నారు.
2015-2017 మధ్య కాలంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కావటం ద్వారా సమాజానికి సందేశంగా నిలిచారు. సబ్ కలెక్టర్‌గా విజయ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆమె భర్త కూడా అదే ప్రాంతంలోని రంపచోడవరం సమీకృత గిరిజనాభివృద్ది సంస్ధ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేయగా వీరు ప్రభుత్వ ఆసుప్రతిని ఎంపిక చేసుకుని సగటు ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగించటంలో సఫలీకృతులయ్యారు.
ప్రైవేటు ఆసుప్రతులకు ప్రభుత్వ వైద్యశాలలు ఏమాత్రం తీసిపోవని నిరూపించేందుకే తాము ఆరోజు అటువంటి నిర్ణమాన్ని తీసుకున్నామని ఉద్యోగుల సమక్షంలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సబ్ కలెక్టర్‌గా విజయవంతంగా విధులు నిర్వహించిన విజయ, అనంతరం కృష్ణా జిల్లా సంయిక్త కలెక్టర్‌గా గత సంవత్సరం అక్టోబర్‌లో బదిలీ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం పరిపాలనా పరమైన కారణాలతో చేసిన బదిలీలలో భాగంగా ఆమెను ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బదిలీ చేసారు. ఈ నేపధ్యంలో మీనా పర్యాటక రంగం గురించిన సమగ్ర అవగాహన కలిగించే ప్రయత్నం చేసారు.