హీరో విక్టరీ వెంకటేష్‌కు యువ హీరో అక్కినేని నాగచైతన్య మేనల్లుడన్న సంగతి తెల్సిందే. తన మేనల్లుడుతో కలిసి వెంకటేష్.. వెంకీమామగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన చిత్రం ఎఫ్-2. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల పంట పండిస్తోంది. ఇప్పటికే రూ.80 కోట్ల మేరకు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో వెంకటేష్ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. తన మేనల్లుడు నాగచైతన్యతో వెంకిమామ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలలో ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ చిత్రం వచ్చే నెల 21వ తేదీ రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించనున్నాడు. పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.