చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారిపై ప్రభుత్వ మద్యం తీసుకెళ్తున్న వాహనం ఒకటి అదుపుతప్పి బోల్తాపడింది. దీన్ని చూసిన స్థానిక ప్రజలు సీసాలను తమకు చిక్కినకాడికి పట్టుకెళ్లారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని వడ్డేపల్లె సమీపంలో ప్రభుత్వ మద్యం స్టాక్ పాయింట్ ఉంది. ఇక్కడి నుంచి దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం ఓపెన్ టాప్ టెంపోలో మద్యం కార్టన్లు తరలిస్తుండగా.. పూతలపట్టు సమీపంలో వాహన ముందు చక్రం పంక్చరైంది.
దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. మద్యం పెట్టెలు కిందపడగా.. కొన్ని సీసాలు పగిలాయి. మిగతావన్నీ చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. గమనించిన పాదచారులు, వాహనదారులు సీసాలు తీసుకెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని సమాచారం.
మంజీరా నీటి సరఫరాకు అంతరాయం.. ఏయే ప్రాంతాల్లో అంటే...
భాగ్యనగరిలో మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. రెండు రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ నగర జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దాదాపు 30కి పైగా ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా నీటి సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.
హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్ చెరు వరకు పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు జరగనున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ బీహెచ్‌ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్ పనులు చేపట్టనున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
కాగా, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలను పరిశీలిస్తే,
ఓఅండ్ఎం డివిజన్ నెం.6 : ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట్ (తదితర ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం)
ఓఅండ్ఎం డివిజన్ నెం.8 : ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు
ఓఅండ్ఎం డివిజన్ నెం.9 : కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
ఓఅండ్ఎం డివిజన్ నెం.15 : ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్.
ఓఅండ్ఎం డివిజన్ నెం.24 : బీరంగూడ, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో వినియోగదారులు మంజీరా తాగు నీరు పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.