Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ వైఖరి వల్ల తమకే కాదు... ప్రజానీకానికి మోసం జరుగుతోంది : వాసిరెడ్డి పద్మ

vasireddy padma

ఠాగూర్

, బుధవారం, 23 అక్టోబరు 2024 (12:30 IST)
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల పార్టీ నేతలకే కాకుండా, రాష్ట్ర ప్రజానీకానికి కూడా మోసం, అన్యాయం జరుగుతుందని, తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె బుధవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. 
 
పార్టీలో తనతో పాటు చాలామందికి కొంతకాలంగా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇది తమకే కాకుండా రాష్ట్ర ప్రజానీకానికి జరుగుతున్న మోసం, అన్యాయమన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ చేస్తున్న మోసాన్ని వ్యతిరేకించడానికే తాను పార్టీ వీడుతున్నట్లు తెలిపారు.
 
తాను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో తనవంతు సాయం చేశానన్న ఆమె.. జగన్ పరిపాలన కాలంలో రాష్ట్ర మహిళలకు స్వర్ణయుగం అనుకుంటే అది చాలా పొరపాటు అని అన్నారు. ఆయన హయాంలో కూడా మహిళల పట్ల ఎన్నో వికృత సంఘటనలు జరిగాయని తెలిపారు. అప్పుడు సీఎంగానీ, హోంమంత్రిగానీ ఎందుకు బాధిత కుటుంబాలను పరామర్శించలేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. 
 
ఇప్పుడు రాజకీయాలు చేయడానికి మహిళలను అడ్డుపెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె అన్నారు. జగన్‌ను 11 స్థానాలకు పరిమితం చేసిన కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారో.. ఇవాళ తాను అదే అభిప్రాయానికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఏకాకిని కాదని, తన వెంట చాలామంది ఉన్నారని ఆమె తెలిపారు. 
 
జగన్‌పై తాను ఒంటరి పోరాటం చేయడంలేదని, సామూహిక పోరాటం చేయబోతున్నానని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్ వ్యవస్థ బాగానే పని చేస్తోందన్నారు. అయితే, అసలు నేరాలు జరగకుండా ఒక పటిష్ఠమైన వ్యవస్థను తీసుకోరావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికోసం సామాజికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.
 
తనను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కుట్ర జరిగిందన్నారు. తనకు జరిగిన తీవ్ర అన్యాయంపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కానీ తాను రాజకీయాలకు దూరంగా ఉండబోనని స్పష్టం చేశారు. ప్రజలవైపే తన అడుగులు అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు వాసిరెడ్డి పద్మ షాక్.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా