వైసీపీ అధినేత జగన్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కొరత పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వర్మ తెలిపారు. కాకినాడ జిల్లాకు మొత్తం 23,359 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటికే 19,385 మెట్రిక్ టన్నులను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరకు యూరియాను అమ్ముకొని రైతులను దోచుకున్నారని వర్మ ఆరోపించారు. ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎమ్మార్పీ రేటుకే యూరియా అందుతుంటే, ఆ వాస్తవం జగన్‌కు కనిపించకపోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు రైతులకు పూర్తిస్థాయిలో యూరియాను అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.