వృద్ధులకు ఆధార్ కార్డుతో సంబంధం లేకుండానే వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించుకున్నామని, రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఎపి ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
విచారణలో భాగంగా కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. పిజి మెడికల్ విద్యార్థుల సేవలకు భవిష్యత్‌లో వెయిటేజీ ఇస్తామమని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం సుమారు 1,300 బ్లాక్ ఫంగస్ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపారు.
థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాగా, రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని న్యాయస్థానానికి తెలిపారు.