అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కేంద్ర మంత్రి సుజనా చౌదరి యోగాసనాలు వేశారు. తిరుపతిలోని అన్ని ఆధ్యాత్మిక సంఘాలు, వాకర్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఏకతాటిపైకి వచ్చి వేలాది మందితో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు... టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణమనాయుడు, గౌనివాని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మలతో పాటు పలువురు ముఖ్యనేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ చేశారు. కార్యక్రమ అనంతరం యోగ గురువులను, కార్యక్రమ నిర్వాహకులను సుజనా చౌదరీ సన్మానించారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రతిరోజూ యోగ చేయడం వల్లే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు అలుపెరగకుండా కష్టపడి పని చేయగలుగుతున్నారన్నారు. అందువల్ల బాల్యం నుంచే పిల్లలకు యోగ నేర్పితే చదులో ఏకాగ్రత, ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం సాధ్యమన్నారు. యోగాకు నిర్ణీత సమయాన్ని ఎలా కేటాయిస్తారో... అలాగే నెట్ చూడటానికి కూడా పిల్లలు ఖచ్చితంగా ఓ నిర్ణీత సమయం కేటాయించేలా ఈ రోజు నుంచి పెద్దలు చర్యలు తీసుకుంటే ఎంతో మంచిదని సూచించారు. యోగ డే తర్వాత కూడా యోగను కొనసాగించాలని ఆయన అందిరిని కోరారు.