తిరుపతి అలిపిరి రోడ్డులోని అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం స్మగ్లర్లతో పోరాడి ఇద్దరిని అరెస్టు చేశారు. రాళ్లతో దాడి చేసినా చెట్లను రక్షణగా తీసుకుని స్మగ్లర్లు నుంచి రెండు వాహనాలతో సహా 75 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ ఇంచార్జి పి.రవిశంకర్‌కు అందిన సమాచారం మేరకు ఆర్‌ఎస్‌ఐలు వాసు, లింగాధర్ టీమ్‌లు శ్రీవారి మెట్టు నుంచి గురువారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. శేషాచలం అడవులలో అలిపిరి వైపు వస్తుండగా ఎన్‌సిసి ఫైరింగ్ రేంజ్ వద్ద స్మగ్లర్లు అలికిడి వినిపించింది. దాదాపు 20 మంది స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తూ కనిపించారు. వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా, టాస్క్‌ఫోర్స్ పోలీసులను గమనించిన స్మగ్లర్లు రాళ్లుతో దాడి చేశారు.
చెట్ల చాటున రాళ్ల దాడి నుంచి తప్పించుకుంటూ వారి వద్దకు చేరుకున్నారు. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. వారిని చేజ్ చేయగా ఇద్దరిని పట్టుకున్నారు. అప్పటికే రెండు కార్లలో కొన్ని దుంగలను లోడ్ చేశారు. రాళ్ల దాడిలో ఒక కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి పట్టుబడిన వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకాకు చెందిన రాజేష్, కుప్పుస్వామిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తప్పించుకున్న వారి కోసం కొంతమంది సిబ్బంది కూంబింగ్ కొనసాగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇంచార్జి పి రవిశంకర్ సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బందిని అభినందించారు. ఇంకా ఆర్‌ఐ చెందు, సిఐ సుబ్రమణ్యం చేరుకుని పరిస్థితి సమీక్షించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు ఏసీబీ అధికారులు దాడులు
దాచేపల్లి చెక్ పోస్ట్ వద్ద గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వాహన దారుల వద్ద నుండి అక్రమంగా మామూళ్లు వసూలు చేస్తున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల వద్ద నుండి రూ.15,530, చెక్ పోస్ట్ ఆవరణలో అనధికారికంగా లెక్కలు చూపని రూ.7650లు స్వాధీనపరుచుకున్నారు. సంబంధిత రికార్డులు తనిఖీ చేస్తున్నారు అనధికార సొమ్ము మొత్తం 23,180 రూపాయలు స్వాధీనపరుచుకున్నారు.