నేను చిత్తూరుజిల్లా కలెక్టర్‌ని. భరత్ నారాయణ్ గుప్త నా పేరు. నేనే రాష్ట్రపతి పర్యటనలో పర్యవేక్షణ అధికారిగా ఉన్నాను. మొత్తం నేనే చూసుకుంటున్నాను. నేను కూడా లోపలికి వెళ్ళాలి పంపించండి అంటూ ప్రాధేయపడ్డారు కలెక్టర్. సాక్షాత్తు కలెక్టర్‌నే అవమానించే విధంగా టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రవర్తించారు.
నిన్న రాష్ట్రపతి పర్యటనలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయనతో పాటు అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు చిత్తూరు జిల్లా కలెక్టర్. తిరుమల రాష్ట్రపతి కుటుంబ సభ్యులతో కలిసి వెనక్కి వెళుతుండగా ఉన్నట్లుండి విజిలెన్స్ వారు ఆపేశారు. ఎవరు మీరు వెళ్ళొద్దండి అంటూ నిలిపేశారు.
తాను కలెక్టర్‌నని ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోలేదు టిటిడి విజిలెన్స్ అధికారులు. సుమారుగా 15 నిమిషాల పాటు బయటే తిరిగారు కలెక్టర్. చివరకు టిటిడి సివిఎస్ఓ కలుగజేసుకుని విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో లోపలికి పంపారు. కలెక్టర్‌కు అవమానం జరిగిందని ఉద్యోగస్తులందరూ నిరసనకు దిగారు. ఈరోజు తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి జరిగిన ఘటనపై విచారణ జరిపి విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.