Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ‌చ్చే ఏడాది నుంచి తిరుమ‌ల వెళ్ళే భ‌క్తులకు ద‌ర్శ‌న టిక్కెట్ల సంఖ్య పెంపు

వ‌చ్చే ఏడాది నుంచి తిరుమ‌ల వెళ్ళే భ‌క్తులకు ద‌ర్శ‌న టిక్కెట్ల సంఖ్య పెంపు
విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (16:54 IST)
కొత్త ఏడాదిలో భక్తుల సౌలభ్యం కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం  నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవలకు సైతం భక్తులను అనుమతించాలని తితిదే పాలకమండలి తీర్మానం చేసింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశమైన తితిదే పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
 
పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. గత ఏడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని తీర్మానించినట్లు చెప్పారు. అన్నమయ్య మార్గంలో మూడో ఘాట్‌రోడ్‌, నడక మార్గం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న ఆలయాలను పునరుద్ధరణ చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని వెల్లడించారు.
 
 
''కరోనా మార్గదర్శకాలు సడలించే అవకాశం ఉంటే సంక్రాంతి నుంచి దర్శనాల సంఖ్య పెంచుతామ‌ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దర్శనాల సంఖ్య పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయించాం. తిరుపతిలో ప్రారంభించిన పీడియాట్రిక్ ఆసుపత్రిలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో 11 మంది పిల్లల ప్రాణాలు కాపాడాం. పద్మావతి పిల్లల ఆస్పత్రి పూర్తి స్థాయిలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. హనుమ జన్మస్థలమైన ఆకాశగంగను విరాళాల ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. శ్రీవారి ఆలయం ఎదురుగా నిర్మిస్తున్న పరకామణి భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. పరకామణిలో చిల్లర నాణేల ప్యాకింగ్‌ కోసం రూ.2.80 కోట్లతో యంత్రాలు కొనుగోలు చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజనులు, మత్స్యకారులను తీసుకొచ్చి దర్శనాలు చేయించాలని నిర్ణయించాం. శ్రీవేంకటేశ్వర నామకోటి పుస్తకాలను ప్రచురించాలని తీర్మానించాం. కళ్యాణకట్ట క్షురకులకు పీస్ రేట్ రూ.11 నుంచి రూ.15కు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం అని సుబ్బారెడ్డి వివ‌రించారు. 
 
 
ఎఫ్ఎంఎస్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేశామ‌ని, కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు తితిదే ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని తెలిపారు. సీఎం హామీ మేరకు తితిదేలో పనిచేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలిపామ‌ని, కాంట్రాక్టర్ కింద పని చేసే కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో కలపలేమ‌న్నారు. ఇప్పటి వరకు తితిదేకి ప్రత్యేకమైన ఐటీ వింగ్ లేద‌ని, తితిదే ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామ‌ని సుబ్బారెడ్డి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు.. 380 రోజులకు తర్వాత..?