గూడ్సు రైలుపై ఒరిగిపోవడంతో రైలు ప్రమాద తీవ్రత తగ్గిందా?
జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వైపు వస్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌కు తూర్పు కేబిన్ వద్ద శనివారం అర్ధరాత్రి పట్టాలు తప్పింది. రైలు స్టేషన్ లోకి వస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో పట్టాలపై గూడ్సు రైలు
జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వైపు వస్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌కు తూర్పు కేబిన్ వద్ద శనివారం అర్ధరాత్రి పట్టాలు తప్పింది. రైలు స్టేషన్ లోకి వస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో పట్టాలపై గూడ్సు రైలు ఆగి ఉంది. రైలు ఒక్కసారిగా గూడ్సు రైలుపై ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, ప్రయాణికులు పేర్కొంటున్నారు. గూడ్స్ రైలు అడ్డుగా ఉండకపోతే జరిగి ఉండే నష్టాన్ని ఊహించలేమని రైల్వే అధికారులు చెబుతున్నారు.
కాగా హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించి పట్టాలు తప్పిన ఏడు బోగీల్లో ఎస్9 బోగీ తీవ్రంగా దెబ్బతింది. జనరల్ బోగీలు, ఎస్9 బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య వీటి నుంచే పెరిగే అవకాశం ఉంది. మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులను విశాఖ, విజయనగరం నుంచి ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో చేరవేసే ఏర్పాట్లు జిల్లా అధికారులు చేశారు. ఘటనా స్థలానికి విజయనగరం జిల్లా, ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నాలుగు ప్రమాద ఉపశమన వ్యాన్‌లను ఘటనా స్థలానికి పంపించామని, గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులలో చేర్చడమే ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకున్నామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. వ్యక్తిగతంగా తాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, ప్రమాద స్థలానికి తక్షణం వెళ్లి సహయ కార్యక్రమాలకోసం ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీనియర్ అధికారులను ఆదేశించానని రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖపట్నం నుంచి వాల్తేరు డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ రిలీఫ్ వ్యాన్‌తో సంఘటనా స్థలానికి బయలుదేరారు.
ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్ (8106053006 (ఎయిర్‌టెల్), 8500358712 (బీఎస్‌ఎన్‌ఎల్) ఏర్పాటు చేశారు.