కాల్పుల కేసు తిరగదోడితే బాలకృష్ణ కూడా వైకాపాలోకి వస్తారు : ఏపీ డిప్యూటీ సీఎం

ఆదివారం, 12 జనవరి 2020 (11:36 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా పార్టీ మారుతారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యంమత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. పైగా, దీనికి సంబంధించిన ఓ చిట్కా కూడా చెప్పారు. బాలయ్యపై ఉన్న కాల్పులు కేసును తిరగదోడితే ఖచ్చితంగా ఆయన కూడా ఖచ్చితంగా వైకాపాలో చేరుతారని అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం మొదలు పెడితే, తెలుగుదేశం పార్టీలో మిగిలేది చంద్రబాబు, లోకేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. బాలకృష్ణపై ఉన్న కాల్పుల కేసును తిరిగి తెరుస్తామని చెబితే, ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారన్నారు. 
 
తన ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో బాలకృష్ణ, నాటి సీఎం వైఎస్ సహాయంతోనే బయటపడ్డారని నారాయణస్వామి గుర్తు చేశారు. అపుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా తనవంతు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. 
 
ఆపై ఇతర పార్టీ నేతలను బెదిరింపులతో చేర్చుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా, సమాధానాన్ని దాటవేశారు. సీఎంగా చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డ ఆయన, స్వలాభం కోసమే అమరావతి పేరిట ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని నారాయణ  స్వామి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ కామాంధుడిని పదవిని నుంచి తొలగించాలి.. ప్రజా సంఘాల డిమాండ్