తిరుమల శ్రీవారి ఆలయంలో వాహన మండపంలో కన్నుల పండువగా గరుడ సేవ జరిగింది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడుని అధిరోహించి వాహన మండపంలోనే భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం అని ప్రతీతి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని చెపుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు, జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని ప్రతీతి. అందుకే భక్త కోటికి గరుడ సేవ ఎంతో ప్రీతిపాత్రం.
శ్రీవారి గరుడ సేవ చూడటానికి రెండు కళ్ళు చాలవని భక్తులు తన్మయం చెందుతున్నారు. ఈ గరుడ సేవ కార్యక్రమంలో తిరుమల తిరుపతి ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, విజివో బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.