తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30వ తేదీ నుంచి ఆగష్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. జూలై 29వ తేదీన అంకురార్పణంతో ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్ధాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. 1962 సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయకమండపంలో వేంచేపు చేస్తారు. జూలై 30వతేదీన పవిత్ర ప్రతిష్ట, జూలై 31వ తేదీన సమర్పణ, ఆగష్టు 1వ తేదీన పూర్ణాహుతి నిర్వహిస్తారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తారు.