తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు నిన్నటి నుండి ప్రారంబించినట్లు అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. నిన్న సాయంత్రం జరిగిన శ్రీవారి సహస్రదీపాలంకార సేవలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి ఏకాంతంగా నిర్వహిస్తున్నదన్నారు. దాదాపు 226 రోజుల తరువాత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం బయట భక్తులకు దర్శనం ఇచ్చినట్లు వివరించారు.
భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. కోవిడ్ తగ్గుతోందని.. మాస్కులను పక్కనబెట్టి భక్తులెవరూ తిరుమలలో తిరగవద్దని విజ్ఙప్తి చేశారు. దయచేసి భక్తులందరూ కోవిడ్ పైన అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న శానిటైజర్లతో చేతులతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు.