వైసీపీలో కొత్తగా ఎమ్మెల్సీగా ఎంపికయిన తోట త్రిమూర్తులుకు పాత కేసు ఒకటి శిరోభారంగా మారింది. దళిత యువకుల శిరోముండనం కేసును వెంటనే పరిష్కరించాలని ఒక వర్గం ధర్నాకు దిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఈ ధర్నాను అడ్డుకునేందుకు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రామ చంద్రపురంలో భారీగా పోలీసులు మోహరించారు.
వెంకటాయపాలెం గ్రామంలో దళిత యువకులకు శిరోముండనం చేయించిన ఆనాటి కేసులో ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పై అభియోగాలున్నాయి. ఈ కేసును తక్షణమే పరిష్కరించాలని, గవర్నర్ కోటాలో తోట త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలని ధర్నాకు దిగారు.
దళిత మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో భారీగా పోలీసుల మోహరించగా, ఆందోళన చేసేందుకు దళిత సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలు తరలివస్తుండటం ఉద్రిక్తతకు దారితీస్తోంది.