భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెనోమ్ వ్యాలీని సందర్శించి, భారత్ బయోటెక్‌లో తయారవుతున్న కోవిడ్-19 వైరస్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఏ దశలో వుందో సమీక్షించనుండడం చాలా ఆనందంగా వుందని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
మూడు దశాబ్దాల క్రితం నా విజన్ నేడు నిజమైందని, నేను పునాది వేసిన జెనోమ్‌వ్యాలీలో భారత్ బయోటెక్ కంపెనీ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయడం నా కలల ప్రాజెక్టు ఫలించిందనేందుకు నిదర్శనమన్నారు.
దేశంలో బయోటెక్ అనే పదం కొత్తగా వినిపిస్తున్న 1990 రోజులలో హైదరాబాద్‌లో జెనోమ్ వ్యాలీకి అంకురార్పరణ చేశామని, ఇప్పుడు అందులో 150కిపైగా ప్రపంచప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కంపెనీలు రిసెర్చ్ అండ్ డెవలజ్‌మెంట్ విభాగాలను నిర్వహిస్తూ జెనోమ్ వ్యాలీ బయోటెక్ హబ్‌గా మారిందని తెలిపారు.
ప్రపంచాన్నివణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీకి జెనోమ్ వ్యాలీ కేంద్రం కావడం, దూరదృష్టితో చేసే పనులు భావితరాలకు ఎలా ఉపయోగపడతాయో మరోసారి నిరూపించిందన్నారు. వైద్యారోగ్య అవసరాలు తీర్చే జెనోమ్ వ్యాలీలో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని, మౌలిక వసతులకు కల్పనకు కృషి చేస్తున్నాయని చెప్పారు.
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మహమ్మారికి చెక్‌పెట్టే కోవాగ్జిన్ తయారీకి నడుం బిగించిన భారత్ బయోటెక్ బృందాన్ని అభినందిస్తున్నానని, అన్ని అవరోధాలు అధిగమించి దేశ ప్రజల ఆరోగ్యానికి అత్యవసరమయ్యే వ్యాక్సిన్‌ను అతి త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు.