Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు
, శనివారం, 7 నవంబరు 2020 (08:56 IST)
చరిత్రకారుల ఊహలకు అందని కాలానికే మనదేశంలో వేదాలు వ్యాప్తిలో ఉన్నాయని, వేదాలు భారతీయ వైజ్ఞానికతకు, సంస్కృతికి ప్రతిబింబాలని విఖ్యాత వేదపండితులు ‘స్వాధ్యాయ రత్న’ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి అన్నారు.

కృష్ణా జిల్లా వేద విద్వత్ ప్రవర్థక సభ ఆధ్వర్యాన ఏటా నిర్వహించే వార్షిక వేద పరీక్షలు లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రారంభమయ్యాయి.

పరీక్షలకు ముఖ్య పరీక్షాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ప్రారంభోపన్యాసం చేస్తూ వ్యవసాయం మొదలు అంతరిక్షం వరకు అనేక విషయాలు వేదాల్లో ఉన్నాయన్నారు. విదేశాల్లో మన వేదాల గురించి గొప్ప పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.

సమాజ సభ్యుడిగా మనిషి ఎలా జీవించాలో, సమాజ వ్యవస్థ సజావుగా సాగటానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలో కూడా వేదాలు చెబుతాయన్నారు. నారాయణేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహభాషణం చేస్తూ వేదాలు వినిపించే ప్రాంతమంతా సశ్యశ్యామలంగా ఉంటుందన్నారు.

వేదాలు పరమేశ్వర స్వరూపమని, వేద మంత్రాలను అనుష్ఠానం చేయటం ద్వారా శబ్దస్వరూపమైన పరమేశ్వర శక్తిని ఉపాసన చేసినట్లవుతుందన్నారు. దేవస్థానం ఛైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏటా వైశాఖమాసంలో పరీక్షలు నిర్వహిస్తామని, కోవిడ్ కారణంగా ఈ ఏడాది పరీక్షలు వాయిదావేసి ప్రస్తుతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వేదపండితులు కంభంపాటి ఆంజనేయ ఘనపాఠి, చల్లపల్లి సుబ్రహ్మణ్య ఘనపాఠి సహాయ పరీక్షాధికారులుగా పాల్గొన్నారు.

జిల్లాల్లోని వివిధ వేదపాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు వివిధ వేద విభాగాల్లో పరీక్షలకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. సుమారు 50 మంది వేదపండితులు సభలకు హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ సచివాలయాల ద్వారా గొప్ప సేవలు: అజ‌య్‌జైన్‌